![]() |
![]() |
ఇటీవలికాలంలో సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన వివాదాలు బాగా పెరిగాయి. అలాగే ఈ వివాదాల్లో ఓటీటీ సంస్థలు కీలకంగా మారాయి. తాజాగా ఓ వెబ్‌సిరీస్ వివాదంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వివాదంలో చిక్కుకుంది. ఈ సిరీస్‌లోని ఒక పాత్రకు సంబంధించిన వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఇందులోని ఒక పాత్ర తన నిజజీవితాన్ని పోలి ఉందని, తన అనుమతి లేకుండా ఆ పాత్రను క్రియేట్ చేశారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిరీస్‌లో ఆ పాత్రను చూపించిన విధానం వల్ల తన ఇమేజ్ దెబ్బతింటోందని సమీర్ కోర్టుకు తెలిపారు.
ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైన తర్వాత తనను, తన కుటుంబాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు సమీర్. నిజానికి తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా సిరీస్‌లోని ఆ పాత్రను తనతో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దానివల్ల కుటుంబపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమీర్ అంటున్నారు. సమీర్ వాంఖడే ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి వెబ్‌సిరీస్‌ను నిర్మించిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకు, స్ట్రీమింగ్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది. ఆ తేదీలోగా ఆయా సంస్థలు తమ వివరణను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే టైటిల్ ఎనౌన్స్ చేసిన రోజు నుంచే ప్రేక్షకుల్లో ఈ వెబ్ సిరీస్‌పై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పుడది కోర్టు వరకు వెళ్ళడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. దీనికి సంబంధించిన వాదోపవాదాలు కోర్టులో జరుగుతుండగా ఈ వెబ్ సిరీస్‌కు ఉచితంగా పబ్లిసిటీ లభిస్తోంది. మరి ఈ కేసులో నిర్మాణ సంస్థ, ఓటీటీ సంస్థ ఏం వివరణ ఇస్తుందో, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
![]() |
![]() |